నిజంనిప్పులాంటిది

Mar 10 2023, 19:23

రేపు కవితను అరెస్ట్‌ చేయొచ్చు: సీఎం కేసీఆర్‌ షాకింగ్‌ కామెంట్స్‌..

హైదరాబాద్‌: కవితకు ఈడీ నోటీసులపై సీఎం కేసీఆర్‌ స్పందించారు. కవితను అక్రమంగా కేసులో ఇరికిస్తున్నారని కేసీఆర్‌ అన్నారు..

''రేపు విచారణ పేరుతో కవితను అరెస్ట్‌ చేసి ఇబ్బంది పెట్టొచ్చు. చేసుకుంటే చేసుకోనీ అందర్నీ వేధిస్తున్నారు. కేసులకు భయపడేది లేదు. న్యాయపోరాటం చేస్తాం. రాబోయే ఎన్నికల్లో బీజేపీని లేకుండా చేద్దాం'' అంటూ సీఎం కేసీఆర్‌ వ్యాఖ్యానించారు. ''బీజేపీలో చేరని వారిని కేసులతో వేధిస్తున్నారు. కవితను కూడా చేరమన్నారు. ​​​మహా అయితే ఏం చేస్తారు.. జైలుకు పంపుతారు'' అంటూ కేసీఆర్‌ మండిపడ్డారు..

కాగా, సీఎం కేసీఆర్‌ అధ్యక్షతన తెలంగాణ భవన్‌లో శుక్రవారం బీఆర్‌ఎస్‌ విస్తృతస్థాయి సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ప్రభుత్వ పథకాలను ప్రజలకు మరింత చేరువ చేయాలని ఆయన పిలుపునిచ్చారు. నియోజకవర్గాల వారీగా కార్యక్రమాలు నిర్వహించాలని, ఎన్నికల్లో మళ్లీ బీఆర్‌ఎస్సే గెలుస్తుందని కేసీఆర్‌ ధీమా వ్యక్తం చేశారు. ''డిసెంబర్‌లో జరిగే ఎన్నికలకు ప్లాన్‌ చేసుకోండి. అవసరమైన చోట యాత్రలు, పాదయాత్రలు నిర్వహించాలి'' అని సీఎం కేసీఆర్‌ అన్నారు.

నిజంనిప్పులాంటిది

Mar 10 2023, 18:03

RSP, RYF, AIPSU ఆధ్వర్యంలో సావిత్రిబాయి పూలే వర్ధంతి

రెవల్యూషనరి సోషలిస్టు పార్టీ(ఆర్ ఎస్ పి),రెవల్యూషనరి యూత్ ఫ్రoట్(ఆర్ వై ఎఫ్),అఖిల భారత ప్రగతిశీల విద్యార్థి సంఘం(ఏ ఐ పి ఎస్ యూ)ల ఆధ్వర్యంలో సిద్దిపేటలోని పార్టీ కార్యాలయంలో సావిత్రిబాయి పూలే వర్ధంతి సందర్భంగా వారి చిత్రపటానికి పూలమాల వేసి నివాళులు అర్పించడం జరిగింది.

ఈ సందర్భంగా ఆర్ ఎస్ పి పార్టీ ఉమ్మడి మెదక్ జిల్లా కార్యదర్శి మన్నె కుమార్ మాట్లాడుతూ ఈ దేశంలో ఆడవారు చదువుకు దూరంగా ఉంటూ, వంటిళ్లకు మాత్రమే పరిమితం చేసిన బానిస సంకెళ్ళ నుండి వారిని విముక్తి చేసిన వీరనారి అని వారు అన్నారు. అలాగే దేశంలోనే మొట్టమొదటి మహిళా ఉపాధ్యాయురాలు, సంఘ సంస్కర్త సావిత్రిబాయి పూలే గారు అని వారు స్పష్టంచేశారు.

ఎన్ని ఆటుపోట్లు ఎదురైనా కూడా సమాజం పట్ల గాని, చదువు విషయంలో గాని వెనుకబడ్డ మరియు అంధకారంలోకి నెట్టివేయబడ్డ ఎంతో మంది స్త్రీలకు చదువు నేర్పిన చదువుల తల్లి అని వారు తెలిపారు. ప్రస్తుత సమాజంలో స్త్రీలు ఆమెను స్ఫూర్తిగా తీసుకుని ముందుకు సాగాలని వారు అన్నారు.ఈ కార్యక్రమంలో ఆర్ ఎస్ పి, ఆర్ వై ఎఫ్, ఏ ఐ పి ఎస్ యూ నాయకులు అప్పాల కృష్ణ, మంకాల శివ, చేర్యాల సాయి కుమార్, స్రవంతి, సౌమ్య, భాను తదితరులు పాల్గొన్నారు.

నిజంనిప్పులాంటిది

Mar 10 2023, 17:58

CM Kcr: సర్వేలన్నీ మనకే అనుకూలం.. షెడ్యూల్‌ ప్రకారమే ఎన్నికలు: సీఎం కేసీఆర్‌

హైదరాబాద్‌: భారాస అధినేత, సీఎం కేసీఆర్‌ అధ్యక్షతన పార్టీ విస్తృత స్థాయి సమావేశం శుక్రవారం తెలంగాణ భవన్‌లో జరిగింది. ఎన్నికల ఏడాది దృష్ట్యా పలు అంశాలపై అధినేత కేసీఆర్‌ పార్టీ నేతలకు దిశానిర్దేశం చేశారు..

పాదయాత్రలు, కార్యకర్తల సమావేశాలు నిర్వహించాలని, నేతలంతా విస్తృతంగా ప్రజల్లోకి వెళ్లాలని సూచించారు. సర్వేలన్నీ తమకే అనుకూలంగా ఉన్నాయన్న సీఎం కేసీఆర్‌..

షెడ్యూల్‌ ప్రకారమే అసెంబ్లీ ఎన్నికలు ఉంటాయని స్పష్టం చేశారు. మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, జెడ్పీ ఛైర్మన్లు పార్టీ సమావేశంలో పాల్గొన్నారు..

నిజంనిప్పులాంటిది

Mar 10 2023, 17:55

Viveka murder case: సీబీఐ విచారణ వెనుక రాజకీయ కుట్రలు: ఎంపీ అవినాష్‌రెడ్డి

హైదరాబాద్‌: మాజీ మంత్రి వైఎస్‌ వివేకానందరెడ్డి హత్య (Viveka Murder case) కేసులో కడప ఎంపీ అవినాష్‌రెడ్డి (Avinash reddy) సీబీఐ విచారణ మూడోసారి ముగిసింది..

దాదాపు 4 గంటలకు పైగా ఆయన్ను సీబీఐ అధికారులు ప్రశ్నించారు. విచారణ అనంతరం అవినాష్‌ మీడియాతో మాట్లాడారు. ''మళ్లీ పిలిచినప్పుడు విచారణకు రావాలని సీబీఐ అధికారులు చెప్పారు. విచారణ సందర్భంగా ఆడియో, వీడియో రికార్డింగ్‌ చేయాలని అడిగాం. రెండు, మూడుసార్లు అడిగినా స్పందించకపోవడంతో హైకోర్టుకు వెళ్లాం. కేసు విచారణ వెనక రాజకీయ కుట్రలున్నాయి. మేం ఎలాంటి తప్పు చేయలేదని కార్యకర్తలకు భరోసా ఇస్తున్నా. అధికారుల వద్ద ఉన్నందున ఇవాళ కోర్టులో జరిగిన విషయాలు నాకు తెలియదు. తప్పుడు ఆధారాలు సృష్టించి విచారణను తప్పుదోవ పట్టిస్తున్నారని గతంలోనే చెప్పాను. కుట్రలకు ఉపయోగపడే స్టేట్‌మెంట్లు మాత్రమే తీసుకుంటున్నారు. ఈ కేసుకు సంబంధించి కీలకమైన అంశాలను పక్కన పెట్టి చిన్నచిన్న విషయాలను ప్రస్తావిస్తూ పెద్దవి చేసేందుకు ప్రయత్నిస్తున్నారు. కట్టుకథ అడ్డం పెట్టుకుని విచారణను ముందుకు తీసుకెళ్తున్నారు. సీబీఐ విచారణ కంచే చేను మేసిన చందంగా ఉంది'' అని అవినాష్‌రెడ్డి ఆరోపించారు.

'ఎంపీ టికెట్‌' కోసమే ఈ హత్య జరిగిందని చేస్తున్న ఆరోపణలు వింటే నవ్వొస్తుంది. చనిపోయే ముందు రోజు కూడా మైదుకూరు నియోజకవర్గం చాపాడు మండలంలో 300 ఇళ్లలో వైఎస్‌ వివేకానందరెడ్డి ఇంటింటికీ ప్రచారం చేశారు. ఎమ్మెల్యే అభ్యర్థిగా రఘురాంరెడ్డి, ఎంపీ అభ్యర్థిగా అవినాష్‌కు ఓటేయండి అని ప్రచారం చేశారు. అక్కడి ప్రజలను పిలిచి విచారణ చేయొచ్చు.. కానీ అలా చేయలేదు. ఎమ్మెల్యే అభ్యర్థి రఘురాం రెడ్డిని పిలిచి విచారణ చేయొచ్చు. అలా చేయలేదు. ఎవరిదగ్గర ఎలాంటి స్టేట్‌మెంట్‌ తీసుకోలేదు. కేవలం వీళ్ల కుట్రలకు ఉపయోగపడే స్టేట్‌మెంట్స్‌ మాత్రమే తీసుకున్నారు. హత్యకు సంబంధంచిన నిజాలను వెలికితీయాలనే ఆలోచనే లేదు. కట్టుకథను అడ్డంపెట్టుకొని.. ఒక వ్యక్తిని టార్గెట్‌ చేసుకొని విచారణను ముందుకు తీసుకెళ్తున్నారు. ఇది సరైన పద్ధతి కాదు.

నా సోదరి సునీత నాపై ఎన్ని విమర్శలు చేసినా మౌనంగానే ఉన్నా. ఈ విషయంలో వైకాపా కార్యకర్తలు అయోమయంలో ఉన్నారు. మేం ఎలాంటి తప్పు చేయలేదని కార్యకర్తలకు ఇవాళ నేను భరోసా ఇస్తున్నా. వివేకా కుటుంబంలోనే అంతర్గతంగా విభేదాలు ఉన్నాయి.

వివేకానందరెడ్డికి 2006 నుంచి ఒకరితో సంబంధం ఉంది. 2011లో బహుశా పెళ్లి కూడా చేసుకున్నారు. ఆ వివాహం చేసుకోవడానికి ఇస్లాం లా ప్రకారం తన పేరును షేక్‌ మహమ్మద్‌ అక్బర్‌గా మార్చుకున్నారు. వారికి షేక్ షెహన్‌షా అనే అబ్బాయి కూడా ఉన్నాడు. భవిష్యత్తులో తన రాజకీయ వారసుడిగా షేక్ షెహన్‌షాను ప్రకటించాలని వివేకానందరెడ్డి దృఢంగా భావించారు. విచారణను తప్పుదోవ పట్టిస్తున్నారనే దానికి ఇది ఒక ఉదాహరణ మాత్రమే.

హత్య జరిగిన తర్వాత కొన్ని సీల్డ్‌ డాక్యుమెంట్లను స్వాధీనం చేసుకున్నట్లు స్టేట్‌మెంట్‌లో వెల్లడించారు. తప్పకుండా అవి నోటరైజ్డ్‌ డాక్యుమెంట్లే.. అవి ఆయన రాసిన వీలునామా అని నేను అనుకుంటున్నాను. ఆయన రెండో భార్య, లేదా వారి అబ్బాయికి ఆయన ఆస్తులు ఇవ్వాలని అనుకోవడం జరిగి ఉండొచ్చు. అయితే, ఈ ప్రక్రియను ఎవరు అడ్డుకోవాలనుకున్నారో? ఈ విషయంలో ఎవరికి ఆసక్తి ఉందో? అనేది తెలియాలి. ఈ కారణంతోనే వివేకానందరెడ్డిని హత్య చేసి ఉంటారని నేను అనుకుంటున్నాను. ఈ కేసుకు సంబంధించి నాకు తెలిసిన ప్రతి విషయాన్ని కోర్టు, మీడియా ముందుకు తీసుకొస్తూనే ఉంటా. ఇంతకాలం నేను మాట్లాడకపోవడానికి ఇవే కారణాలు తప్ప మరొకటి కాదు. దీని వెనక ఉన్న రాజకీయ కుట్రలను ఛేదిస్తాం. ఎంత దూరమైనా న్యాయపోరాటం చేసేందుకు నేను సిద్ధంగా ఉన్నా'' అని అవినాష్‌ రెడ్డి తెలిపారు..

నిజంనిప్పులాంటిది

Mar 10 2023, 12:57

టెలిగ్రామ్ లో డేటింగ్ పేరుతో 30 లక్షల సైబర్ మోసం..

హైదరాబాద్ ఎస్సార్ నగర్ కి చెందిన ఓ వ్యక్తి..టెలిగ్రామ్ లో కాల్ గర్ల్ సర్వీస్ బుక్ చేసుకున్న బాధితుడు.

సర్వీస్ తో పాటు వివిధ ఛార్జీల పేరుతో 15 లక్షలు కాజేసిన చీటర్స్..

అనంతరం డబ్బులు రిటర్న్ అడగడంతో.. రిఫండ్ పేరుతో పలు దఫాలుగా మరో 15 లక్షలు కాజేసిన చీటర్స్..

మొత్తం 30 లక్షలు కాజేసిన..సైబర్ చీటర్స్..

హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులకు పిర్యాదు చేసిన బాధితుడు.

కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్న పోలీసులు..

నిజంనిప్పులాంటిది

Mar 10 2023, 12:48

Aadhaar Card: ఆధార్‌, రేషన్‌కార్డు, ఓటర్ ఐడి కార్డు, డ్రైవింగ్‌ లైసెన్స్‌ ఉన్నవారికి అదిరిపోయే శుభవార్త..!

ప్రస్తుతం మనకుండే డాక్యుమెంట్లలో కీలకమైనది ఆధార్‌ కార్డు. ఇది లేనిది ఏ పని జరగదు. అలాగే ప్రతి ఒక్కరికి ఆధార్‌తో పాటు డ్రైవింగ్‌ లైసెన్స్‌, ఓటర్‌ ఐడి కార్డు, రేషన్‌ కార్డు.. వంటి కార్డులు కూడా ముఖ్యమైనవే. ఈ నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం త్వరలో దేశ ప్రజలకు గుడ్‌న్యూస్‌ అందించబోతోంది. ఆధార్‌, ఓటర్‌ ఐడీ, డ్రైవింగ్‌ లైసెన్స్‌, రేషన్‌ కార్డుల విషయంలో కీలక నిర్ణయం తీసుకోబోతోంది. కేంద్రం అదిరిపోయే సరికొత్త సర్వీసును అందుబాటులోకి తీసుకురానున్నట్లు తెలుస్తోంది. దేశ ప్రజలు ఇబ్బందులు పడాల్సిన అవసరం లేకుండా మోడీ ప్రభుత్వం కొత్త సర్వీసును అందుబాటులోకి తీసుకురానుంది. ఈ కొత్త సేవ ద్వారా ప్రజలకు ఎంతో ఊరట కలుగనుంది. చాలా మందికి ఆధార్‌తో పాటు డ్రైవింగ్ లైసెన్స్‌, ఓటర్‌ ఐడికార్డు, రేషన్‌ కార్డు వంటివి ఉంటాయి. ఇవి కీలకమైన డాక్యుమెంట్లు. చాలా మందికి ఆధార్‌లో ఒక అడ్రస్‌ ఉంటే డ్రైవింగ్‌ లైసెన్స్‌, రేషన్‌ కార్డు, ఓటర్ ఐడి కార్డులలో మరో అడ్రస్‌ ఉంటుంది.

ఈ డాక్యుమెంట్లలో వేర్వేరు వివరాలు ఉంటాయి. ఇలాంటి సమయంలో అన్ని డాక్యుమెంట్లలో వివరాలు సరి చేసుకోవాలంటే ఎన్నో ఇబ్బందులు పడాల్సి ఉంటుంది. వాటన్నింటికి వేర్వేరు కార్యాలయాలు, మీ సేవకు కేంద్రాలకు వెళ్లి సరి చేసుకోవాల్సి పరిస్థితి ఉంటుంది. కొన్నింటి డాక్యుమెంట్లలకు వివరాలు సరి చేసుకోవాలంటే అసలు ఆప్షనే లేదు. ఇలా పత్రాలన్నింటిలో వివరాలను అప్‌డేట్ చేసుకోవడం కష్టమైన పనే. ఎందుకంటే వివరాలను మార్చుకోవడానికి ఒక్కో డాక్యుమెంట్ కోసం ఒక్కో చోటుకు వెళ్లాల్సి ఉంటుంది.

అందుకే ఇలాంటి ఇబ్బందులను దృష్టిలో ఉంచుకుని మోడీ సర్కార్ కీలక నిర్ణయం తీసుకోబోతోంది. రానున్న రోజుల్లో డాక్యుమెంట్లలో ఏవైనా వివరాలు అప్‌డేట్‌ చేసుకోవాలంటే మరింత సులభతరం కానుంది. కేంద్రం తీసుకువచ్చే కొత్త సర్వీసులతో ఈ పని సులభం కానుంది.

ఈ నేపథ్యంలో కేంద్రం కొత్ల ప్లాట్‌ఫామ్‌ తీసుకువచ్చేందుకు ప్రయత్నాలు చేస్తున్నట్లు సమాచారం. మినిస్ట్రీ ఆఫ్‌ ఎలక్ట్రానిక్స్‌ అండ్‌ ఇన్ఫర్మేషన్‌ టెక్నాలజీ కొత్త సిస్టిమ్‌ను రూపొందిస్తోంది. దీని ద్వారా ఆధార్‌లోని ఏవైనా మార్పులు ఉంటే ఆ మార్పులన్ని కూడా ఆటోమేటిక్‌గా ఇతర డాక్యుమెంట్లలో కూడా అప్‌డేట్‌ అవుతాయి. మీరు మీ ఆధార్‌ కార్డులో ఏవైనా వివరాలు అప్‌డేట్‌ చేస్తే ఆ వివరాలు ఓటర్‌ ఐడి, డ్రైవింగ్‌ లైసెన్స్‌, రేషన్‌ కార్డుల్లో కూడా అప్‌డేట్‌ అవుతాయి. అది జరిగితే కనుక అన్ని డాక్యుమెంట్లలో ఒకే విధమైన వివరాలు ఉంటాయి.

మినిస్ట్రీ ఆఫ్‌ ఎలక్ట్రానిక్స్‌ అండ్‌ ఇన్ఫర్మేషన్‌ టెక్నాలజీ ఈ కొత్త సిస్టమ్‌ డెవలప్‌మెంట్‌ కోసం ట్రాన్స్‌పోర్ట్‌, రూరల్‌ డెవలప్‌మెంట్‌, పంచాయతీ రాజ్‌, ఎలక్షన్‌ కమిషన్‌ ఆఫ్‌ ఇండియా వంటి వాటిలో చర్చలు జరుపుతున్నట్లు సమాచారం. ఐటీ శాఖ డ్రైవింగ్‌ లైసెన్స్‌, రేషన్‌ కార్డు, ఓటర్ ఐడి కార్డు వంటి కీలకమైన పత్రాలను జారీ చేసే డిపార్ట్‌మెంట్లతో చర్చించనుంది. తర్వాత పాస్‌పోర్టు వంటి ఇతర డాక్యుమెంట్లకు ఈ కొత్త సర్వీసులను అందుబాటులోకి తీసుకురానుంది. ఏదీ ఏమైనా ఈ సర్వీసు కనుక అందుబాటులోకి వస్తే దేశ ప్రజలకు శుభవార్తేనని చెప్పాలి.

నిజంనిప్పులాంటిది

Mar 10 2023, 12:35

లాకప్ రూముల్లో సీసీ కెమెరాలు పెట్టండి.. అన్ని రాష్ట్రాలకు సుప్రీం ఆదేశం

న్యూఢిల్లీ: పోలీస్​ స్టేషన్లలోని ఇంటరాగేషన్, లాకప్​ రూముల్లో సీసీ కెమెరాలు పెట్టాలని సుప్రీంకోర్టు రాష్ట్ర ప్రభుత్వాలను ఆదేశించింది. సీబీఐ, ఎన్ఐఏ, ఈడీ వంటి విచారణ సంస్థల ఆఫీసుల్లోనూ సెక్యూరిటీ కెమెరాలు పెట్టాలని పేర్కొంది. కస్టడీలో నిందితులపై హింసను అరికట్టేందుకు సీసీ కెమెరాలతో పాటు ఆడియో రికార్డింగ్​ కూడా చేయాలని సూచించింది.

దేశంలోని అన్ని పోలీస్​ స్టేషన్లలో ఎంట్రీ, ఎగ్జిట్​ప్లేసులతో పాటు లాకప్​ రూములు, కారిడార్, స్టేషన్​ రిసెప్షన్​ ఏరియా, సబ్​ ఇన్​స్పెక్టర్, ఇన్​స్పెక్టర్​ రూమ్​లు, వాష్​ రూమ్​ బయట సీసీ కెమెరాలను అమర్చాలంది. ఈ ఏర్పాట్లకు అవసరమైన నిధులు కేటాయించాలని, నిర్ణీత సమయంలోపల సీసీటీవీ కెమెరాలను అమర్చాలని అన్ని రాష్ట్ర ప్రభుత్వాలను సుప్రీం ఆదేశించింది. ఈ ఏర్పాట్లకు సంబంధించి పూర్తి యాక్షన్​ ప్లాన్​ను ఆరు వారాల్లోగా కోర్టుకు సమర్పించాలని పేర్కొంది. ఈ కెమెరాల్లో రికార్డైన పుటేజ్​ను, ఆడియో రికార్డింగ్​ను 18 నెలల పాటు జాగ్రత్త చేయాలని, అవసరమైతే కోర్టులకు ఎవిడెన్స్​గా అందజేయాలని పేర్కొంది.

పోలీస్​ స్టేషన్లలో విచారణ సందర్భంగా మానవ హక్కుల ఉల్లంఘన జరగకుండా ఇండిపెండెంట్​ ప్యానెల్​తో తరచూ సీసీటీవీ ఫుటేజ్​ చెకింగ్​ జరిపించాలని రాష్ట్ర ప్రభుత్వాలకు సూచించింది. ప్రతీ జిల్లాలో హ్యూమన్​ రైట్స్​ కోర్టులను ఏర్పాటు చేయాలని ఆర్డర్​ వేసింది. పంజాబ్​లో జరిగిన కస్టోడియల్​ డెత్​కు సంబంధించిన కేసు విచారణలో సుప్రీం ఈ ఆదేశాలు జారీ చేసింది. ఇంటరాగేషన్​ ఏరియాలలో కెమెరాల ఏర్పాటుకు 2018లోనే ఆదేశాలు జారీ చేసినా.. ఇప్పటి వరకూ అమలు చేయకపోవడంపై ఆగ్రహం వ్యక్తం చేసింది. ఈ ఏర్పాట్ల సంబంధించిన వివరాలను వచ్చే నెల 27న పరిశీలిస్తామని కోర్టు తెలిపింది.

నిజంనిప్పులాంటిది

Mar 10 2023, 12:23

Viveka Murder Case: మూడోసారి సీబీఐ ఎదుట హాజరైన ఎంపీ అవినాష్‌ రెడ్డి..

హైదరాబాద్: మాజీ మంత్రి వైఎస్‌ వివేకానంద రెడ్డి హత్య కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న కడప ఎంపీ వైఎస్‌ అవినాష్‌ రెడ్డి మరోసారి సీబీఐ విచారణకు హాజరయ్యారు..

విచారణలో భాగంగా.. సీబీఐ తనపై తీవ్రమైన చర్యలు తీసుకోకుండా ఆదేశించాలంటూ గురువారం తెలంగాణ హైకోర్టులో అవినాష్‌రెడ్డి పిటిషన్‌ దాఖలు చేసిన విషయం తెలిసిందే. ఇప్పటివరకు రెండు అభియోగ పత్రాలను సీబీఐ దాఖలు చేసిందని, వీటి ప్రకారం వివేకా హత్యపై గంగిరెడ్డి చెప్పారంటూ దస్తగిరి ఇచ్చిన వాంగ్మూలం మినహా తాను నేరంలో పాల్గొన్నట్లు ఎలాంటి ఆధారాలూ లేవని అవినాష్‌రెడ్డి పిటిషన్‌లో పేర్కొన్నారు. నేడు విచారణకు రానున్న ఈ పిటిషన్‌లో వివేకా కుమార్తె సునీత ఇంప్లీడ్‌ కానున్నారు.

మరోవైపు ఈకేసులో చంచల్‌గూడ జైలులో జ్యుడీషియల్‌ ఖైదీలుగా ఉన్న సునీల్‌యాదవ్‌, ఉమాశంకర్‌ రెడ్డి, దేవిరెడ్డి శివశంకర్‌ రెడ్డితో పాటు గంగిరెడ్డి, దస్తగిరి సీబీఐ కోర్టుకు హాజరయ్యారు..

నిజంనిప్పులాంటిది

Mar 10 2023, 10:52

Women's Bill : ఎమ్మెల్సీ కవిత దీక్ష ప్రారంభం .. BRS శ్రేణులతో కోలాహలంగా జంతర్ మంతర్‌

RS for Women's Bill : మహిళా రిజర్వేషన్ బిల్లును పార్లమెంట్‌లో ప్రవేశపెట్టి.. ఆమోదింపజేయాలని డిమాండ్ చేస్తూ... బీఆర్ఎస్ పార్టీ.. ఢిల్లీ జంతర్ మంతర్ దగ్గర ధర్నా ప్రారంభించింది..

ఇందులో భాగంగా... టీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత.. ఉదయం 10.15కి జంతర్ మంతర్‌ ప్రాంగణంలో నిరాహార దీక్ష ప్రారంభించారు. ముందుగా స్వాతంత్ర్య సమరయోధుల విగ్రహాలకు పూలమాలలు వేసిన ఆమె... ఆ తర్వాత దీక్షా స్థలి దగ్గర కూర్చున్నారు. మహిళా రిజర్వేషన్ బిల్లును ఆమోదించడం ద్వారా మహిళలకు చట్టసభల్లో 33 శాతం రిజర్వేషన్ లభిస్తుందనీ.. ఇప్పటివరకూ అలా జరగట్లేదని.. బీఆర్ఎస్ చెబుతోంది.

భారత జాగృతి సంస్థ ఈ దీక్షను నిర్వహిస్తోంది. దీనికి సీపీఐ , సీపీఎంతోపాటూ... ఎన్సీపీ , టీఎంసీ, సమాజ్‌ వాదీ పార్టీ, డీఎంకే , ఆప్ , నేషనల్‌ కాన్ఫరెన్స్, శివసేన , పీడీపీ, జేడీయూ, ఆర్జేడీ, అకాలీదళ్, ఆర్‌ఎల్డీ, జేఎమ్‌ఎమ్‌ సహా 18 పార్టీలు సంఘీభావం ప్రకటించాయి..

సాయంత్రం 4 గంటల వరకు ఈ దీక్ష కొనసాగనుంది. సీపీఐ కార్యదర్శి డి.రాజా... ధర్నాలో పాల్గొన్న ఎమ్మెల్సీ కవిత దీక్షను విరమింపజేస్తారని తెలిసింది. ఈ ధర్నాలో బీఆర్ఎస్ నేతలు, మహిళా మంత్రులు, కార్యకర్తలతోపాటూ... 29 రాష్ట్రాల్లో మహిళా హక్కుల కోసం పోరాడుతున్న వారు కూడా పాల్గొన్నారు..

నిజంనిప్పులాంటిది

Mar 10 2023, 07:42

కేసీఆర్ ముందస్తు నగారా!?

కవిత విచారణతోనే ముడిపడిందా..?

ఊహించని వ్యూహాలు, ఎత్తుగడలతో ప్రత్యర్థులను బోల్తాకొట్టించడంలో సిద్ధహస్తుడిగా పేరొందిన తెలంగాణ సీఎం, బీఆర్ఎస్ అధినేత కే.చంద్రశేఖర్ రావు మరో మాస్టర్ స్ట్రోక్‌కు సిద్ధమయ్యారా?... ముందస్తు ఎన్నికల వ్యూహంతో విపక్ష నేతలను ఉక్కిరిబిక్కిరి చేయబోతున్నారా?... 2019 మాదిరిగానే అసెంబ్లీని రద్దు చేసి ముందస్తు సీన్‌ను రిపీట్ చేయబోతున్నారా?... ఢిల్లీ లిక్కర్ స్కామ్‌లో ఎంఎల్‌సీ కవిత అరెస్టైతే ఎన్నికల నగారా మోగించడం ఖాయమా?... ఢిల్లీ లిక్కర్ స్కామ్‌లో ఈడీ కవిత విచారణ, అరెస్ట్ కూడా చేయొచ్చనే ఊహాగానాల నేపథ్యంలో తెలంగాణ పొలిటికల్ సర్కిల్స్‌లో ఈ అంశాలే హాట్ టాపిక్‌గా మారాయి. ఒక్కసారిగా ముందస్తు ఊహాగానాలు గుప్పుమన్నాయి. మరి సీఎం కేసీఆర్ నిజంగా ముందస్తుకు వెళ్తారా?. సడెన్‌గా ఈ ప్రచారానికి కారణాలు ఏమిటో ఒక లుక్కేద్దాం...

నిజానికి సీఎం కేసీఆర్ సారధ్యంలోని రెండో దఫా సర్కార్ ముందస్తుకు వెళ్లబోతోందంటూ చాలాసార్లు జోరుగా ప్రచారం జరిగింది. బీఆర్ఎస్ కీలక విస్తృతస్థాయి సమావేశాలు నిర్వహించిన ప్రతిసారి ఈ తరహా ఊహాగానాలను చూస్తూనే ఉన్నాం. ముఖ్యంగా బీఆర్ఎస్ ఆవిర్భావం తర్వాత రాష్ట్రంలో తొలి భారీ బహిరంగ సభగా పేర్కొన్న ‘ఖమ్మం మీటింగ్’ సమయంలోనూ కొంతకాలం ఇదే ప్రచారం నడిచింది. తాజాగా ఢిల్లీ లిక్కర్ స్కామ్‌లో కవిత ఈడీ విచారణ, అరెస్ట్ ఊహాగానాల మధ్య మరోసారి ఆ చర్చ తెరపైకి వచ్చింది.

సీఎం కేసీఆర్ గురువారం హఠాత్తుగా క్యాబినెట్ భేటీ నిర్వహించడం, మరుసటి రోజు శుక్రవారమే బీఆర్‌ఎస్‌ విస్తృతస్థాయి సమావేశానికి పిలుపునివ్వడం ఈ ఊహాగానాలకు ప్రధాన కారణమైంది. కవితను అరెస్ట్ చేస్తే సానుభూతి వస్తుందని బీఆర్ఎస్ వర్గాలు అంచనాలు వేస్తున్నాయని, అసెంబ్లీని రద్దు చేసి ఎన్నికలకు వెళ్తే సానుకూల ప్రభావం ఉంటుందని, అందుకు తగిన సమయం ఇదేననేది విశ్లేషణలు, ఊహాగానాల సారాంశం.

కవిత అరెస్ట్‌తో సానుభూతి వస్తుందా?

తెలంగాణ అసెంబ్లీకి ఈ ఏడాది చివరిలో ఎన్నికలు జరగనున్నాయి. ఈ మేరకు పార్టీలన్నీ సమాయత్తమవుతున్నాయి. ఇప్పటికే కసరత్తులు కూడా ప్రారంభించాయి. వేర్వేరు కార్యక్రమాల ద్వారా క్షేత్రస్థాయిలో క్రియాశీలకంగా ఉండి ఓటర్లకు చేరువయ్యే ప్రయత్నాలను ముమ్మరం చేశాయి. ఇందులో భాగంగా నేతల విమర్శలు, ప్రతివిమర్శలు సైతం పదునెక్కాయి. ముఖ్యంగా కేంద్రం, రాష్ట్రంలోని అధికార పార్టీలైన బీజేపీ (BJP), బీఆర్ఎస్‌ల (BRS) మధ్య నువ్వా-నేనా అనే రీతిలో మాటల యుద్ధం (Words war) కొనసాగుతోంది. ఢిల్లీ లిక్కర్ స్కామ్‌లో ఎంఎల్‌సీ కవితపై ఆరోపణలు వచ్చాక ఈ రాజకీయ వాతావరణం మరింత రంజుగా మారింది. తాజాగా కవితకు ఈడీ నోటీసులు, అరెస్ట్ చేయొచ్చనే ప్రచారం మధ్య ఈ పరిస్థితి హీటెక్కింది. బీజేపీని ప్రశ్నిస్తున్నందునే తమ నేతలపై కేంద్రం కక్షకట్టిందని... ఈడీ, సీబీఐ వంటి దర్యాప్తు సంస్థలను ఉసిగొల్పి వేధింపులకు పాల్పడుతోందని బీఆర్ఎస్ వర్గాలు చెబుతున్నాయి. రాజకీయ దురుద్దేశంతోనే ఇబ్బంది పెడుతున్నారని ఒకింత ప్రచారం ఉంది కాబట్టి.. ఢిల్లీ లిక్కర్ స్కామ్‌లో కవిత అరెస్టైతే జనాల్లో బీఆర్ఎస్‌కు సానుభూతి వస్తుందా? అనే చర్చ ప్రస్తుతం తెలంగాణ పాలిటిక్స్‌లో హాట్ టాపిక్‌గా మారింది. నిజానికి కవిత అరెస్ట్‌ బీఆర్ఎస్‌కి సానుకూలమా? ప్రతికూలమా? అనే చర్చ పక్కనపెడితే ఈ అంశమే ముందస్తు ఎన్నికల ఊహాగానాలకు ప్రధాన కారణమైంది.

సీఎం కేసీఆర్ అధ్యక్షతన క్యాబినెట్ భేటీ, శుక్రవారం బీఆర్ఎస్ విస్తృత స్థాయి సమావేశాలు ఈ చర్చకు ఆజ్యం పోశాయనే చెప్పాలి. కవిత అరెస్ట్ అయితే ఎలా వ్యవహారించాలనే అంశంపైనే బీఆర్ఎస్ చర్చించబోతోందని స్పష్టమైన సంకేతాలు రావడం.. మరోపక్క జిల్లా స్థాయి నేతలు సైతం విస్తృత స్థాయి సమావేశానికి హాజరవ్వాలంటూ సమాచారం అందివ్వడం ముందస్తు చర్చకు బలం చేకూర్చాయనే టాక్ వినిపిస్తోంది. మరోవైపు కవిత అరెస్టయితే రాష్ట్ర వ్యాప్తంగా బీజేపీ వ్యతిరేక ఉద్యమాన్ని తీసుకురావాలని బీఆర్ఎస్ భావిస్తోందనే ప్రచారమూ ఉంది. మరి ఈ ఊహాగానాలు ఎంతవరకు నిజమవుతాయనేది వేచిచూడాల్సిందే.